యువగళం పాదయాత్ర 133వ రోజు(బుధవారం) తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి నుంచి రాపూరు క్రాస్ రోడ్డు వరకు 17.2 కిలోమీటర్లు కొనసాగింది. ఇప్పటి వరకు మొత్తం 1,720.9 కిలోమీటర్లు నడిచారు. ప్రతి గ్రామం వద్దా లోకేశ్‌ను చూసేందుకు భారీ ఎత్తున మహిళలు, యువత, వృద్ధులు తరలి వచ్చి రోడ్లపై నిరీక్షించడం కనిపించింది. అంతకుముందు బస కేంద్రంలో పాస్టర్లు, చేనేత కార్మికులతో లోకేశ్ విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..... హ్యాండ్ లూమ్‌కు, పవర్ లూమ్‌కు మధ్య తేడా తెలిసేలా ప్రత్యేక బ్రాండింగ్ తీసుకొస్తామని, ప్రత్యేక ట్యాగ్‌లు రూపొందించడంతో పాటు ప్రత్యేక జోన్లు కూడా ప్రకటిస్తామన్నారు. హ్యాండ్‌లూమ్ ఉన్నచోట పవర్ లూమ్ పెట్టకుండా నిబంధనలు తెస్తామని తెలిపారు. పట్టు రైతుల నుంచి చేనేతలో రంగులు అద్దే కార్మికుల వరకూ అందరినీ ఆదుకుంటామన్నారు. ఆదరణ పథకాన్ని తిరిగి ప్రారంభించి, పనిముట్లు అందజేస్తామని చెప్పారు. వెంకటగిరిలో మెరుగైన మోడల్‌తో టెక్స్‌టైల్ పార్క్ తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.