యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ఏపీపీఎస్సీ ద్వారా హ్యాండ్‌లూమ్ టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. మంగళగిరిలో వీవర్స్ శాల అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చామని, టాటా కంపెనీతో ఒప్పందం చేసుకుని పైలెట్ ప్రాజెక్టు చేస్తున్నామన్నారు. మెరుగైన వసతులతో షెడ్లు నిర్మించి చేనేత కార్మికులు అక్కడికి వచ్చి చీరలు నేసుకునేలా అవకాశం కల్పిస్తున్నామని, తయారైన చీరలను టాటా సంస్థ ద్వారా విక్రయిస్తున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానం అమలు చేస్తామన్నారు. చేనేత ఉత్పత్తులను మార్కెట్‌కు లింక్ చేసి కార్మికులకు లబ్ధి చేకూరేలా చేస్తామన్నారు. సొంత మగ్గం వున్న వారికి ప్రతినెలా 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందజేస్తామని, చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు అందజేస్తామన్నారు. చేనేతవస్త్రాల తయారీపై జీఎస్టీ భారం పడకుండా చూస్తామన్నారు. జీఎస్టీని తమ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను కూడా ఆదుకుంటామన్నారు. ఒక్క సంతకంతో రూ.110 కోట్ల చేనేత రుణాలను టీడీపీ ప్రభుత్వం మాఫీ చేసిందని, యార్న్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ, పట్టు సబ్సిడీ కూడా అందించిందని, ఆదరణ పథకంలో 50 శాతం సబ్సిడీతో మగ్గాలు అందజేశామని, వర్షాకాలంలో చేనేత కార్మికులకు పెన్షన్ ఇచ్చామని చెప్పారు. జగన్ వచ్చాక అన్ని సబ్సిడీలూ రద్దు చేశారని ఆరోపించారు. 60 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదన్నారు. ఆప్కోను భ్రష్టు పట్టించాడని ఆరోపించారు.