పాడేరు పరిధిలోని జి.మాడుగుల మండలం కోరాపల్లి గ్రామానికి చెందిన కోరాబు త్రిమూర్తి కుమార్తె బోడకొండమ్మ అలియాస్ గాయత్రి(20) ఐదు నెలల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయి జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ రూడిబయలు గ్రామానికి చెందిన పాంగి గణపతి(30)తో ఉంటోంది. అప్పటికే అతనికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మూడో భార్యగా చేసుకుంటానని చెప్పి ఒంగోలు తీసుకువెళ్లాడు. కొన్నాళ్లు అక్కడ ఉన్న తరువాత తనను పుట్టింటికి తీసుకువెళ్లమని గాయత్రి కోరడంతో అతను ఈ నెల 14వ తేదీన అక్కడికి తీసుకువెళ్లకుండా తన స్వగ్రామమైన రూడిబయలులోని పిన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమె తన పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండడంతో ఈ నెల 16వ తేదీ ఉదయం 7 గంటలకు ఆమె మెడకు చున్నీ చుట్టి హతమార్చాడు. తన కుటుంబ సభ్యులైన పాంగి శోభన్‌బాబు(21), పాంగి మహేష్‌బాబు(23), పాంగి లక్ష్మమ్మ(45), పాంగి భారతి(29), వెంకట్‌లకు ఈ విషయం చెప్పాడు. వారి సహకారంతో గాయిత్రి మృతదేహాన్ని పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీ తియ్యగెడ్డ గ్రామంలో పాతిపెట్టారు. దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. గిరిజన యువతిని హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించిన కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఐదుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.