అన్నదాతకు అండగా నిలబడి అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొమానపల్లిలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో బుధవారం ఆయన ప్రముఖులు, కార్మిక, కర్షక వర్గాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. అన్నం తినే ప్రతి వ్యక్తికీ రైతుల బాధ తెలియాలన్నారు. అధికార పార్టీకి చెందిన ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి లాంటి దళారులు రైతులను దోచుకుని అన్యాయంగా సంపాదిస్తున్నారన్నారు. రాష్ట్రంలో జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంటలకు పెట్టుబడి సాయం అందించేలా కృషి చేస్తామన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఉమ్మడి కార్యాచరణ అవసరమని... ఆ దిశగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. అన్నదాతల సమస్యల పరిష్కారానికి కలిసి వస్తామంటే పార్టీలకతీతంగా రైతు సంఘాలతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రైతు సంఘాల ప్రతినిధులు వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కోనసీమ రైతులు గతంలో సుభిక్షంగా ఉండేవారని, పండించిన పంటను నిల్వ చేసుకుని ధర వచ్చినప్పుడు అమ్ముకునే పరిస్థితి ఉండేదన్నారు. ప్రస్తుతం పండించిన పంటను వెంటనే అమ్ముకునేందుకు చూస్తున్నామన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించాలని, ధాన్యం డబ్బులు వెంటనే రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు గుద్దటి జమ్మి, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. పంట పొలాల్లో ముంపు నీరు దిగేందుకు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రతిఏటా ఖరీఫ్ పంట కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్లో ఉన్న అనైక్యత వల్లే దళారుల చేతుల్లో మోసపోతున్నారన్నారు. వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వైసీపీకి చెందిన రైతులకు పరిహారం అందించారని వారు ఆరోపించారు. గతంలో రైస్‌బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే గోదావరి జిల్లాల్లో నేడు వరిని పండించేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వరిని అధికంగా పండించే గోదావరి జిల్లాల్లో రైతులను రక్షించుకోలేకపోతే దాని ప్రభావం మిగిలిన జిల్లాలపై పడుతుందన్నారు. రైతులు కష్టించి పండించిన పంటకు మద్దతు ధర వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. పచ్చని కోనసీమలో క్రాప్‌హాలిడే ప్రకటించి అన్నదాతలు నిరసన తెలుపుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు అండగా నిలిచేందుకు తాను సిద్ధమని పవన్ అన్నారు. సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యుడు పితాని బాలకృష్ణ పాల్గొన్నారు.