బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమాలపై జగన్ అధ్యక్షతన వర్క్‌షాపు జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరు బాగుంటేనే ఎన్నికల్లో వారికి టికెట్లు ఇస్తామని, పనితీరు బాగోలేదంటే అవకాశం ఉండదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆగస్టు 31వ తేదీతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగుస్తుందని, ఆ లోగా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ తమ గ్రాఫ్ పెంచుకోవాలన్నారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతే తానేమీ చేయలేనన్నారు. గడప గడపకు కార్యక్రమంలో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదని ఐ ప్యాక్ సర్వేలో తేలిందని వెల్లడించారు. వారి పేర్లను తాను బోర్డుపై (పీపీటీ స్ర్కీన్‌పై) ప్రదర్శించదలచుకోలేదన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడతానన్నారు.