‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ పేరును ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’గా లేదా ‘వైఎస్‌ఆర్‌సీపీ’గా మార్చే ప్రతిపాదనగానీ, ఆలోచనగానీ లేదని ఆ పార్టీ తమకు స్పష్టం చేసిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పార్టీ శాశ్వత అధ్యక్షునిగా జగన్మోహన్‌రెడ్డి ఎన్నికవ్వడం, పార్టీ పేరు విషయం... పలు సందేహాలను లేవనెత్తుతూ గతంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దానికి స్పందనగా ఇటీవల రఘురామరాజుకు ఎన్నికల సంఘం జాబు రాసింది. ‘‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరిట పార్టీని రిజిస్టర్ చేయడానికి 2010 జూలై 13న దరఖాస్తు వచ్చింది. అయితే, అప్పటికే అదే పేరుతో పార్టీ పేరు నమోదు కోసం దరఖాస్తు వచ్చిన నేపథ్యంలో తిరస్కరించాము. దీనిపై అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. చివరికి యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీగా 2011 జనవరి 21న పార్టీ నమోదయ్యింది’’ అని లేఖలో ఎన్నికల సంఘం వివరించింది.