ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి పరచడానికి తాము చేస్తున్న ప్రయత్నంలో క్రైస్తవ మత పెద్దలైన పాస్టర్లు కూడా భాగస్వాములు కావాలని లోకేశ్ పిలుపునిచ్చారు. పాస్టర్లకు తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మైనారిటీ కార్పొరేషన్ విభజనకు ఆలోచిస్తున్నామని, అలాగైతే ముస్లింలకు, క్రైస్తవులకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటవుతాయని తెలిపారు. కార్పొరేషన్ ద్వారా శ్మశానాలు, చర్చిలకు స్థలాలివ్వడానికి, పాస్టర్లకు గౌరవవేతనాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. అధికారంలోకి వచ్చాక మూడు నెలలకోసారి క్రైస్తవులతో సమావేశం నిర్వహిస్తామని, సంబంధిత మంత్రి, అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించారు. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ల విధానంలోనూ మార్పులు తెచ్చి పాస్టర్లకు సహకరిస్తామని, వారికి ఐడీ కార్డులు, గౌరవ వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారు. క్రైస్తవులకు శ్మశానవాటికల కొరతపై అధ్యయనం చేయిస్తామని లోకేశ్ పేర్కొన్నారు.