కర్ణాటకలో ఓ చిన్న షెడ్డులో నివసిస్తున్న తొంభై ఏళ్ల వృద్ధురాలు రూ.లక్షకు పైగా కరెంటు బిల్లు రావడంతో షాక్‌కు గురయ్యారు. షెడ్డులో రెండు బల్బులు ఉన్నా గిరిజమ్మకు రూ.1,03, 315 బిల్లు వచ్చింది. షెడ్డులో కుమారుడితో కలిసి జీవిస్తున్న మహిళకు ప్రభుత్వం భాగ్యజ్యోతి పథకం కింద విద్యుత్ కనెక్షన్ ఇచ్చింది. ఈ పథకం కింద 18 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో ఆ మహిళకు నెలకు రూ.70 నుంచి రూ.80 విద్యుత్ బిల్లు వచ్చేది. ఆరు నెలల క్రితం జీస్కోమ్ అధికారులు మీటరును అమర్చడంతో నెలవారీ బిల్లు రూ.20 వేల వరకు పెరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే జెస్కామ్ అధికారులు ఆమె ఇంటికి చేరుకుని మీటర్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ మాట్లాడుతూ 2021 నుండి మీటర్ రీడింగ్ సమస్య కారణంగా మహిళకు అదనపు కరెంటు బిల్లు వస్తోందని, బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని, అధికారులు సమస్యను పరిష్కరిస్తారని ఆమెకు హామీ ఇచ్చారు.