గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల మెరుగైన ఆరోగ్య సంరక్షణతో పాటు పేదలకు ఉచిత వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగనన్న నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు గ్రామంలో రూ. 24 లక్షలతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్ (హెల్త్ వెల్ నెస్ సెంటర్) నూతన భవనాన్ని శాసనసభ్యులు కృష్ణప్రసాదు గురువారం ప్రారంభించారు. శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రతి విలేజ్ క్లినిక్ను నెలలో రెండుసార్లు పీహెచ్సీ వైద్యులు సందర్శిస్తున్నారని, రోజంతా ఆ గ్రామంలో ఉండి ఓపీ వైద్య సేవలతో పాటు, మంచానికే పరిమితమైన వారికి కూడా వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను కూడా విజిట్ చేసి, విద్యార్థులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు వెల్లడించారు. విలేజ్ క్లినిక్స్ లలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అందుబాటులో ఉంటారన్నారు. గ్రామాల్లోనే 14 రకాల పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. గర్భం నిర్ధారణకు యూరిన్ టెస్ట్, హిమోగ్లోబిన్ టెస్ట్, ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (షుగర్), మలేరియా టెస్ట్, హెచ్ఐవీ నిర్ధారణ, డెంగ్యూ టెస్ట్, మల్టీపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్), అయోడిన్ టెస్ట్, వాటర్ టెస్టింగ్, హెపటైటిస్ బి నిర్ధారణ, ఫైలేరియాసిస్ టెస్ట్, సిప్లిస్ ర్యాపిడ్ టెస్ట్, విజువల్ ఇన్స్పెక్షన్, స్పుటమ్ (ఏఎఫ్బీ) టెస్టులు విలేజీ క్లినిక్స్ లో చేస్తున్నారన్నారు. టీబీ, లెప్రసీ, థైరాయిడ్ సహా పలు వ్యాధుల చికిత్సల కోసం 105 మందులను విలేజ్ క్లినిక్స్ లోనే అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. విలేజ్ క్లినిక్స్ లలో టెలీ మెడిసిన్ ద్వారా పీహెచ్సీ వైద్యునితోపాటు జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిషన్ వంటి స్పెషలిస్ట్, వైద్యుల కన్సల్టేషన్ సేవలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఓపీ, టెలీ మెడిసిన్ సేవలతో పాటు హైరిస్క్ గర్భిణుల గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, ఆర్సీహెచ్ పోర్టల్లో చిన్నారుల రిజిస్ట్రేషన్, ఏడాదిలోపు పిల్లలకు ఫుల్ ఇమ్యూనైజేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. అనారోగ్యంతో ఉన్నవారు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాయనపాడు గ్రామాభివృద్ధితో పాటు, ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.