శృంగవరపుకోట నియోజకవర్గం జామి మండలంలో గల అగ్రహారం భూముల విషయంపై అభ్యంతరాలను తెలిపేందుకు గడువు కావాలని జామి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా జామి మాజీ జడ్పిటిసి బండారు పెదబాబు ఆధ్వర్యంలో గురువారం స్థానిక డిప్యూటీ తాసిల్దార్ సునీతకు వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారితో అగ్రహారం భూములకు చెందిన రైతులను సమన్వయం చేసే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు తాసిల్దార్ ను కోరారు. అగ్రహారం భూములకు సంబంధించి తాసిల్దార్ హేమంత్ కుమార్ గతంలో నిర్వహించిన సమావేశాలకు కొంతమంది రైతులను ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు డిప్యూటీ తాసిల్దార్ సునీత మాట్లాడుతూ అగ్రహారం భూములు విషయమై భవిష్యత్తులో జరగనున్న సమావేశాలకు అగ్రహారం భూములు కలిగిన అందరు రైతులకు ఆహ్వానం పంపించినట్లు ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షులు లగుడు రవికుమార్, తెదేపా నాయకులు బి. స్వామి నాయుడు, ఎన్నింటి అప్పలరాజు, మర్రి రమణ తదితరులు పాల్గొన్నారు.