పవన్ కల్యాణ్ రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. జన జోరుతో పవన్ మాటల్లో హుషారొచ్చింది. ‘మొదటిగా భారతీయుడిని.. చివరిగా భారతీయుడిని అని చెప్పిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ పేరుతో ఏర్పాటైన జిల్లా ప్రజలందరికీ నా నమస్కారాలు.. కోనసీమ ప్రేమలో ఘాటు ఉంటుంది. అభిమానంలో తట్టుకోలేని శక్తి ఉంటుంది. ఈ భూమిలో అగ్ని ఉండడంతో పౌరుషం అరికాలి నుంచి నడినెత్తి వరకు ఉంటుంది’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. 8.50 గంటలకు సభాస్థలికి చేరుకున్న పవన్ నేరుగా వారాహి వాహనంపైకి ఎక్కి ప్రసగించారు. జై భీమ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి అంబేడ్కర్ జెండాలతో వచ్చిన కార్యకర్తలను ఉత్తేజపరిచారు. తొలుత గుడి దగ్గర జనసందోహాన్ని చూసి జాగ్రత్తగా ఉండండి.. వైసీపీ చివరికి గుడి దగ్గర ఉన్న చెప్పులను కూడా ఎత్తుకుపోతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.వేల కోట్ల రూపాయల చమురు సంపదను తరలించుకుపోతున్న జిల్లా కేంద్రంలో ప్రజలకు సరైన వైద్యసేవలందించే ఆసుపత్రులు లేకపోవడం దారుణమన్నారు.