గత 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా దేశంలోని భావ సారూప్యతలు కలిగిన వివిధ పార్టీలు ఒకతాటి పైకి రావాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ప్రతిపక్ష పార్టీలన్నింటితో కలిపి పాట్నాలో శుక్రవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ కోసం వివిధ పార్టీల నేతలు ముందుగానే పాట్నాకు చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పాట్నాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇటీవలె కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసుకుని కోలుకున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిశారు. లాలూ నివాసానికి వెళ్లిన దీదీకి, ఆమె మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లాలూ కాళ్లకు మమత నమస్కరించారు. ఆ తర్వాత ఇరువురు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లాలూ భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవీ, ఆర్జేడీ యువనేత, బిహార్ ఉపముఖ్యమంత్రి, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్‌తో భేటీ అనంతరం.. దీదీ మీడియాతో మాట్లాడారు. లాలూ చాలా సీనియర్ నాయకుడు అని.. చాలా రోజులు జైళ్లో, హాస్పిటల్‌లో ఉన్నారని తెలిపారు. లాలూతో భేటీ కావడం చాలా సంతోషంగా ఉందన్న దీదీ.. ఇప్పటికే లాలూ ఫిట్‌గా ఉన్నారని.. బీజేపీపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాల సమావేశం గురించి మాట్లాడిన మమతా బెనర్జీ.. విపక్షాలన్నీ ఒక కుటుంబం లాగా ఏర్పడి.. ఐక్యంగా మోదీ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించి.. దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల సమావేశం నిర్మాణాత్మక సాగుతుందని ఆశిస్తున్నట్లు మమత వెల్లడించారు.
ఈ విపక్షాల ఐక్యత సమావేశానికి హాజరు కావడానికి ఇతర పార్టీల నేతలు కూడా బిహార్‌కు చేరుకుంటున్నారు. గురువారం రాత్రి వరకే పాట్నా చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రతిపక్షాల ఐక్యత సమావేశం జరగనున్నట్లు జేడీయూ పార్టీ వర్గాలు వెల్లడించాయి.