విడాకుల కేసులో తనకు సహజన్యాయం జరగడం లేదనే అసంతృప్తితో రగిలిపోయిన ఓ వ్యక్తి (55).. కోర్టు ఆవరణలో ఉన్న జడ్జి కారుపై ప్రతీకారం తీర్చుకున్నాడు. కోర్టు లోపలి నుంచి బయటకురాగానే ఎదురుగా కనిపించిన జడ్జి కారుపై దాడి చేశాడు. అద్దాలు పగులగొట్టి, వాహనం ధ్వంసం చేశాడు. ఈ ఘటన కేరళలోని పథనంతిట్ట జిల్లా తిరువళ్లా కోర్టు ఆవరణలో బుధవారం చోటుచేసుకుంది. దీంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకొని ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తిరువళ్లా పోలీసు అధికారి తెలిపారు.
‘‘నిందితుడి భార్యే విడాకుల కోసం దరఖాస్తు చేసింది. న్యాయమూర్తి, న్యాయవాది కుమ్మక్కై తన గోడు సరిగా వినిపించుకోవడం లేదన్నది అతడి కోపానికి కారణం’’ అని పోలీసు అధికారి వివరించారు. తన వాదనలను పట్టించుకోలేదని, సహజన్యాయం జరగలేదనేది అతడి ఆరోపణ అని పేర్కొన్నారు. ఈ విడాకుల కేసు గత ఆరేళ్లుగా కొనసాగుతోందని చెప్పారు.
మొదట 2017లో పథనంతిట్టా కోర్టులో విడాకుల కేసు విచారణకు వచ్చింది. అయితే ఆ కోర్టుపై తనకు నమ్మకం లేదని పేర్కొంటూ దానిని బదిలీ చేయాలని సదరు భర్త కేరళ హైకోర్టును ఆశ్రయించాడని అధికారి తెలిపారు. దీంతో ఈ కేసును తిరువళ్లా కోర్టుకు ఈ ఏడాది బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసిందని అన్నారు.