అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులివెందుల సంస్కృతిని రాష్ట్రంలోని అన్ని చోట్లకు తీసుకొచ్చారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. నేరగాళ్ల బెదిరింపులకు చివరికి మంచివాళ్లు కూడా లొంగిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.నేరగాళ్లు రాజకీయాలు చేస్తే రాష్ట్రం మొత్తం నాశనమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జనసేన పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా తాను కుల రాజకీయాలు చేయలేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందుకే విభిన్న కులాలు, మతాల నుంచి జనసేన సభ్యులను తీసుకున్నట్లు వివరించారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా నిలదొక్కుకోవడమే గొప్ప విషయమన్నారు. ప్రజలకు జనసేన భావజాలం అవసరం ఉందని దీన్ని బట్టి అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు.
కుల, మత ప్రస్తావన రెచ్చగొట్టేందుకు కాదు.. కుల సర్దుబాటు కోసమే తాను కుల ప్రస్తావన తీసుకొస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. గత ఎన్నికల్లో రాజోలు విజయం జనసేన పార్టీకి ఊపిరి పోసిందని చెప్పారు. రాజకీయ పదవుల్లో మూడో వంతు మహిళలు ఉండాలన్నారు. రాష్ట్రంలో ప్రజల హక్కులకు ఎప్పుడు భంగం కలిగినా పోరాడతానని చెప్పారు.
రాష్ట్రంలో రూ. 200 లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడుతుందని.. కానీ, రూ. వేల కోట్లు దోపిడీ చేసే నేతలు మాత్రం పరిపాలన చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో మన ఓట్లు తీసేస్తారు.. దొంగ ఓట్లు వేస్తారు.. జాగ్రత్త అని జనసైనికులకు వార్నింగ్ ఇచ్చారు.
మన ఓటుతో గెలిచి జవాబుదారీతనం లేకపోతే కుదరదని పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని ప్రజలు రీకాల్ చేయాలని.. రెఫరెండం పెట్టి అనర్హత వేటు వేసేలా చట్టాలు తీసుకురావాలని వ్యాఖ్యానించారు. గోదావరి జిల్లాల నుంచే మార్పు మొదలు కావాలని.. వచ్చే ఎన్నికలు మార్పునకు సంకేతం అని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.