టీడీపీ తొలి విడత మేనిఫెస్టోకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలపై మహిళలు, రైతులు చర్చించుకుంటున్నారని తెలిపారు. ఇక, మంత్రి అంబటి రాంబాబు తనపై తీవ్ర ఆరోపణలు చేశారని కన్నా మండిపడ్డారు. సీఎంను విమర్శించినందుకు బీజేపీ అధ్యక్ష పదవి పోగొట్టాలని కుట్ర చేశారని ఆరోపించారు. ఎన్నికల నిధులు దుర్వినియోగం అయినట్టు పత్రికల్లో వార్తలు వేయించారని వివరించారు. 2019 ఎన్నికల నిధుల వినియోగంపై అప్పట్లో కమిటీ వేశారని తెలిపారు. పార్టీ నిధుల వినియోగంలో తన పాత్ర అసలు లేదని కన్నా స్పష్టం చేశారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో చంద్రబాబు కాపులకు 5 శాతం ఇచ్చారని, జగన్ మాత్రం గోదావరి జిల్లాల్లోనే కాపు రిజర్వేషన్లు వ్యతిరేకించారని విమర్శించారు. జగన్ సీఎం అయ్యాక కాపులపై లేఖ రాస్తే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించారు.