ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేకలకు పులి వదల్లేదు, అధికారులు అడవిలోకి వెళ్లలేదు,,,,బాలుడిని పులి ఎలా వదిలేసింది?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 25, 2023, 07:21 PM

మనకు తెలియకుండానే సమాజంలో అనేక వింతలు  చోటు చేసుకొంటూవుంటాయి.  ఇదిలావుంటే మృత్యువు ఎప్పుడు, ఏ వైపు నుంచి దూసుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు చావు చివరి దాకా వెళ్లిన వాళ్లు కూడా ఏదో అద్భుతం జరిగి ప్రాణాలతో బయటపడతారు. తిరుమలలో రెండు రోజుల కిందట జరిగిన ఘటన కూడా ఈ కోవకే చెందుతుంది. మూడేళ్ల బాలుడు కౌశిక్‌.. చిరుతపులి బారిన పడినా, ప్రాణాలతో తిరిగొచ్చాడు. పోలీసులు కాపాడారు; ఎస్సై, టీటీడీ సిబ్బంది కేకలు వేయడం వల్లే చిరుతపులి ఆ బాలుణ్ని వదిలేసి వెళ్లిందని మొదట్లో వార్తలు వచ్చినా.. ప్రత్యక్షసాక్షులు, బాలుడి బంధువుల కథనం మాత్రం మరోలా ఉంది. ‘బాలుడిని దేవుడే కాపాడాడు’ అంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక లోతైన అర్థం ఉందని ఆలస్యంగా తెలుసుకొని భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.


ఆదోని నుంచి వచ్చిన కుటుంబం నడక మార్గంలో తిరుమలకు బయల్దేరింది. ఆరుగురు సభ్యుల ఆ బృందం రాత్రి 9 గంటల సమయంలో ఏడో మైలు సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కాసేపు ఆగారు. బాలుడి తాత అతడికి చిప్స్ ప్యాకెట్ కొనిచ్చాడు. కుటుంబసభ్యులు అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుంటుండగా.. బాలుడు కౌశిక్ చిప్స్ తింటూ రోడ్డు పక్కన నిల్చున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా చిరుత వచ్చి బాలుడిని అమాంతం నోట కరచుకొని వెళ్లిపోయింది.


బాలుడి తాత, అక్కడ ఉన్న భక్తులు కేకలు వేశారు. అప్పుడే అటుగా వస్తున్న ఎస్సై రమేష్ ఆ కేకలు విన్నారు. బాలుడిని తీసుకొని పారిపోతున్న చిరుతను చూశారు. అరుపులు చేస్తూ అది వెళ్లిన దిశగా పరుగు అందుకున్నారు. కానీ, ఆ చిరుతపులి అప్పటికే అక్కడి గోడను దూకి బాలుడిని అడవిలోకి ఈడ్చుకెళ్లింది. చీకటిలో మాయమైపోయింది. అడవిలోకి వెళ్లలేక అధికారులు, భక్తులు అక్కడే ఆగిపోయారు. కేకలు వేసినా ఫలితం లేకపోవడంతో బాలుడి బంధువుల గొంతు తడారిపోయింది. భయంతో ఒంట్లో వణుకు పుట్టింది.


కాసేపటి తర్వాత అనూహ్యం. పిట్టగోడ వద్ద బాలుడి ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు విని అక్కడికి పరుగెత్తుకెళ్లి చూడగా.. ఆ చిన్నారి సాయం కోరుతూ దీనంగా పైకి చూస్తున్నాడు. అక్కడున్న వాళ్లలో కొంత మంది వెంటనే కిందకి దూకి బాలుడిని ఎత్తుకొని పైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రిలో చేర్పించారు.


బాలుడిని అడవిలోకి లాక్కెళ్లిన చిరుత, ఆ తర్వాత ఎలా వదిలేసింది? అభం శుభం తెలియని ఆ బాలుడు చిమ్మ చీకటిలో, గాయాలతో ఆ పిట్ట గోడ వద్దకు తిరిగి ఎలా వచ్చాడు? క్రూర జంతువు దాడి చేసినా.. చిన్న చిన్న గాయాలు మినహా పెద్దగా సర్జరీలు కూడా అవసరం లేకుండా బాలుడు ప్రాణాలతో ఎలా బయటపడగలిగాడు? ఇప్పుడు కొంత మంది భక్తులు వేస్తున్న ప్రశ్నలివి. వీటికి సమాధానం దొరికితే అద్భుతమే!


‘అది కేవలం ఏడాదిన్నర వయసు గల చిరుత కూన సార్. బాలుడి బరువు మోయలేకే అతడిని వదిలేసి వెళ్లింది’ అని మరికొందరి వాదన. నోటితో బాలుడ్ని కరవలేదని అంటున్నారు. ఇందులో అద్భుతం ఏమీ లేదని వారి భావన. మరి, బాలుడిని మోయలేకపోతే, అమాంతం నోట కరచుకొని 8 అడుగుల ఎత్తైన పిట్టగోడ పైనుంచి ఎలా దూకగలిగింది? అడవిలోకి వెళ్లాక దానికి ఏ అడ్డు వచ్చింది? - ఇవి భక్తుల ప్రశ్నలు.


అంతేకాదు.. చిరుతకూనలకు మూడు నెలల వయసు వచ్చినప్పటి నుంచే తల్లి వేటాడటం నేర్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 8 నెలల నుంచి ఏడాది వయస్సుకు వచ్చేసరికి అవి వేటాడటం నేర్చుకుంటాయట. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వయస్సు వచ్చేనాటికి వేటలో నైపుణ్యం కూడా సాధిస్తాయని చెబుతున్నారు. అంటే.. ఆ చిరుతపులికి వేటాడటంలో అంత అనుభవంలేదనీ అనుకోలేం! మరి ఏం జరిగింది? ఏదో అద్భుతమే జరిగింది! గురువారం (జూన్ 22) రాత్రి జరిగిన ఘటన బాలుడి తల్లిదండ్రులకు ఒక అద్భుతంలా కనిపిస్తోంది! ‘ఓం నమో వేంకటేశాయ:’ మంత్రం వినిపిస్తే.. వారి ఒళ్లు తన్మయత్వంతో ఊగిపోతోంది.


తిరుమల శ్రీనివాసుడు కోరుకుంటే తన భక్తులను ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా రప్పించుకుంటాడని భక్తుల నమ్మకం. అన్నీ సవ్యంగా జరిగితే, ఆ కుటుంబం ఈపాటికే శ్రీవారిని దర్శించుకొని ఇంటికి తిరిగి చేరుకొని ఉండేది. ఆపదమొక్కుల వాడి దర్శనం కోసం ఆ కుటుంబం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. బాలుడిని త్వరలోనే డిఛ్చార్జ్ చేయనున్నారు. డిచ్ఛార్జ్ అయిన వెంటనే ఆ కుటుంబాన్ని టీటీడీ వాహనంలో తిరుమలకు తీసుకెళ్లి దివ్య దర్శనం చేయించి, ఆదోనిలోని వారి ఇంట్లో దింపి వస్తామని టీటీడీ ఛైర్మన్ హామీ ఇచ్చారు. ఆ అపురూప ఘడియల కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. అంతవరకూ వారి పెదాలపై వినిపించే మాట ఒక్కటే - ఓం నమో వేంకటేశాయ.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa