కులం, మతంతో సంబంధం లేకుండా మంచి వారికి, అభివృద్ధి పనులు చేసిన వారికి, దేశం కోసం పాటుపడిన వారికి ఓటువేయాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 80 ఫీట్ రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల సమతా సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా గరికిపాటి మాట్లాడుతూ.. ఓంకారానికి శక్తి ఉందని, ఓంకార నాదం చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుందన్నారు. వేదం నేర్చుకోవడానికి కులమత బేధాలు ఉండవని అందరూ నేర్చుకోవచ్చునన్నారు. కులం పేరు పెట్టి రాజకీయాలు చేయడం ద్రోహమన్నారు. తెలుగు భాష ఎంతో గొప్పదన్నారు. హిందుత్వం అందరి మతమని సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు హటకేశం అన్నారు. స్వామి శ్రీనివాసానంద మాట్లాడుతూ.. హిందువులపై దాడులు ఆపాలన్నారు. మాజీమంత్రి గౌతు శ్యామ్‌సుందర్ శివాజీ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమకారులు సాహిత్యం, సేవా కార్యక్రమాలతో అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డు ఉపకులపతులు హనుమంతు లజపతిరాయ్, గొల్లపల్లి నాగేశ్వరరావు, బూసిరాజు, పి.సుందరీరాణి, కన్నంనాయుడు, నర్సింగనాయుడు, డాక్టర్ కె.అమ్మన్నాయుడు, డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు, డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. రచయిత భమిడిపాటి గౌరీశంకర శాస్ర్తి రచించిన ఉత్తరాంధ్ర సమరతా సారథులు పుస్తకాన్ని గరికిపాటి ఆవిష్కరించారు.