రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపిస్తూ మహిళా రెజ్లర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా, ఆందోళనలపై రెజ్లర్లు కీలక ప్రకటన చేశారు. ఇకపై తాము వీధి పోరాటాలు చేయబోమని, న్యాయస్థానంలో పోరాడతామని ఆదివారం ప్రకటించారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుందని రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మలిక్, బజరంగ్ పునియాలు ఒకే విధంగా ట్వీట్ చేయడం గమనార్హం.
‘ఈ కేసులో న్యాయం జరిగే వరకు రెజ్లర్ల నిరసన కొనసాగుతుంది.. అయితే అది (పోరాటం) కోర్టులో ఉంటుంది.. రోడ్లపై కాదు.. డబ్ల్యూఎఫ్ఐ (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)లో సంస్కరణకు సంబంధించి ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 11న ఎన్నికలకు సంబంధించి వాగ్దానం నెరవేర్చడం కోసం మేము వేచి చూస్తాం’అని తెలిపారు. ఈ పోస్ట్ చేసిన చేసిన కొద్ది సేపటికే తాము సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నట్టు వినేశా ఫోగట్, సాక్షి మలిక్ ట్వీట్ చేశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఇటీవలే పలు సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లు తమ పోరాటం కోర్టులో సాగుతుందని ప్రకటించడం గమనార్హం. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్ భూషణ్ శరణ్ తరుచూ ఖండిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువైతే ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష తప్పదు. ఆయన పోలీసులకు సహకరిస్తారని, కోర్టు ఆదేశాలను శిరసావహిస్తారని రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ అనుచరుడు ఒకరు అన్నారు.
ఆసియా క్రీడల ట్రయల్స్ నుంచి మినహాయింపు వివాదం నేపథ్యంలో నిరసనకు నాయకత్వం వహిస్తున్న ముగ్గురు రెజ్లర్లు శనివారం సోషల్ మీడియా లైవ్‌లో సింగ్‌పై తమ పోరాటం కొనసాగుతుందని నొక్కి చెప్పారు. ఆయనపై దాఖలైన ఛార్జిషీట్‌ను బేరీజు వేసుకుని ప్రచారాన్ని ఎలా కొనసాగించాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. తమను బ్రిజ్ భూషణ్ అనేక సందర్భాల్లో అసభ్యంగా తాకడం, లైంగిక ప్రయోజనాలను డిమాండ్ చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఏడుగురు రెజ్లర్లు ఆరోపించారు.