జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికైనా భారతదేశంలో అంతర్భాగమని తేల్చి చెప్పారు. ఆ ప్రాంతంలో పాకిస్థాన్‌కు ఎలాంటి స్థానం లేదని పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌లోని ఎక్కువ భాగం పాకిస్థాన్ ఆక్రమణలో ఉందని పేర్కొన్న రాజ్‌నాథ్.. అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని పేర్కొన్నారు. వారంతా భారత్ వైపు చూస్తున్నారని.. వారు భారత్‌లోనే అంతర్భాగంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ప్రజల పట్ల పాకిస్థాన్ అన్యాయంగా ప్రవర్తిస్తోందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పదే పదే పాక్ ఆక్రమిత కశ్మీర్ తమదే అని చెప్పుకోవడం వల్ల పాకిస్థాన్ సాధించేది ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. పీఓకేను ఆక్రమించుకోవడం పాకిస్థాన్ వల్ల కాదని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో సోమవారం జరిగిన సెక్యూరిటీ కాంక్లేవ్‌లో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఇందులో మాట్లాడిన రాజ్‌నాథ్. పీఓకే భారత్‌లో అంతర్భాగమని పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మాణం చేసినట్లు గుర్తు చేశారు. ఇందులో భాగంగా మూడు ప్రతిపాదనలు పార్లమెంటులో ఆమోదం పొందాయని వెల్లడించారు.