ఇపుడు దేవాలయాలు వెళ్లాలంటే కూడా ఎలా వెళ్లాలి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలావుంటే మీరు మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వెళ్తున్నారా. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. ఇక నుంచి మహారాష్ట్రలోని దేవాలయాలను సందర్శించే ముందు మీ వస్త్రధారణపై దృష్టి పెట్టుకోవాల్సిందే. మహారాష్ట్రలోని దేవాలయాల్లో దర్శన సమయంలో భక్తులు సరైన వస్త్రధారణ పాటించేలా అక్కడి ఆలయాలు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర వ్యాప్తంగా 130 కిపైగా ఆలయాలు ఈ డ్రెస్‌కోడ్‌ను అమలు చేస్తున్నాయి. దీంతోపాటు పుణ్యక్షేత్రాలకు 500 మీటర్ల పరిధిలో మద్యమాంసాల విక్రయాలపైనా నిషేధం విధించాలని ‘మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్’ డిమాండ్ చేస్తోంది.
మహారాష్ట్రలోని ఆలయాల పవిత్రతను పరిరక్షించేందుకు మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్ అనే సంస్థ నడుం బిగించింది. ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడేందుకు ఈ మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్ విస్తృత ప్రచారం చేస్తోంది. కేవలం డ్రెస్ కోడ్ మాత్రమే కాదు మరిన్నింటినీ పాటించేలా ఆదేశాలు, సూచనలు చేస్తోంది. ఆయా పుణ్యక్షేత్రాలు, దేవాలయాలకు 500 మీటర్ల పరిధిలో మద్యం గానీ, మాంసం గానీ విక్రయించడంపై నిషేధం విధించాలని మహాసంఘ్ డిమాండ్ చేస్తోంది. ఈ మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్‌లో ఆలయ ధర్మకర్తలు, నిర్వాహకులు, పూజారులు, న్యాయవాదులు, కార్యకర్తలు సహా వివిధ వర్గాల వారు సభ్యులుగా ఉన్నారు.
ఇలాంటి ఆదేశాలతో ప్రజలను దేవుళ్లకు దూరం చేయడం తమ ఉద్దేశం కాదని.. మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్ స్పష్టం చేసింది. అయితే కొంతమంది సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం, ఫోటోలు, రీల్స్ కోసం సరైన వస్త్రధారణ లేకుండా.. ఇష్టం వచ్చినట్లు దేవాలయాలకు వస్తూ.. వీడియోలు తీస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ఆలయాల్లో పవిత్రత పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రార్థనా స్థలం అయినా పవిత్రతను కాపాడాలని.. ఈ నేపథ్యంలోనే దేవాలయాలకు వెళ్లే సమయంలో ఎలాంటి వస్త్రాలు ధరించాలి.. ఎలాంటివి ధరించకూడదనే అంశంపై దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు.
ఆలయాలకు వెళ్లే సమంయలో ఎలాంటి బట్టలు వేసుకోవాలన్న దానిపై మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్ కొన్ని విధి విధానాలు వెల్లడించింది. రివీలింగ్, షార్ట్ ఫిట్టింగ్ లేదా బిగుతుగా ఉండే వస్త్రాలు.. చిరిగిపోయిన దుస్తులు వేసుకోకూడదని పేర్కొంది. ప్యాంటు, చొక్కాలు వేసుకోవడంపై ఎలాంటి అభ్యంతరాలు లేవని మహాసంఘ్ సమన్వయకర్త సునీల్ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి వీలైనన్ని ఎక్కువ ఆలయాల్లో ఇలాంటి వస్త్రధారణపై విధివిధానాలు తీసుకువస్తాయని చెప్పారు. ఆచార, సంప్రదాయాల ప్రకారం జంతు బలులు మినహాయించి.. దేవాలయాలకు 500 మీటర్ల పరిధిలో మద్యం, మాంసం అమ్మకాలను నిషేధించాలని డిమాండ్ చేశారు.