కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటా స్వీట్ వార్నింగ్ ఇస్తూ దడ పుట్టిస్తోంది. మిగిలిన బెండ, దొండ, బీర, సొరకాయ, వంకాయలు కూడా షాక్ కొట్టే ధరలతో భయపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. ఏది కొందామన్నా గుండెదడ పుట్టేలా ఉంది పరిస్థితి. సంచి నిండా వెజిటబుల్స్ తెద్దామనుకుని వెళ్లిన వాళ్లు.. ఆ పెరిగిన ధరలు చూసి ఉన్న డబ్బులతో హ్యాండ్ బ్యాగుల్లో కూరగాయలను సర్దుకుని రావాల్సిన పరిస్థితి నెలకొంది. అంతగనం పెరిగాయి మరి ధరలు. విశాఖ రైతు బజార్‌లోకి అడుగు పెట్టగానే వెజిటబుల్స్ ఊరిస్తాయి. ముట్టుకుంటే మాత్రం షాక్ కొడతాయి. అల్లం కిలో 300, వెల్లుల్లి 200, పచ్చిమిర్చి కిలో 120, టమోటా అయితే 100 రూపాయలకు చేరుకుని ఇంకా ఎగబాకడానికి రెడీగా ఉంది. పెరిగిన ధరలతో ప్రజల హైరానా మామూలుగా లేదు.