సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు చేరువ చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, జగన్‌రెడ్డి వచ్చాక అమలు చేసిన పథకాల కన్నా రద్దుచేసిన పథకాలే ఎక్కువని నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. రమణక్క పేటలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలసి ఇంటింటికి వెళ్ళి మేనిఫెస్టోపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముద్దరబోయిన మాట్లాడుతూ.... రైతు భరోసా కింద రూ.13 వేలు ఇస్తానని చెప్పిన జగన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ పథకంతో కలిపి ఇవ్వడం రైతులను మోసం చేయడమేనన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత పథకం కింద కేంద్రంతో సంబంధం లేకుండా రైతుల ఖాతాల్లో రూ.20 వేలు జమ చేస్తామన్నారు. ఇంట్లోని ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి ఇచ్చి మరో విద్యార్థి చదువును జగన్ ప్రశ్నార్ధకం చేశాడన్నారు. చంద్రబాబునాయుడు తల్లికి వందనం పేరిట రూ.15 వేలు ఇస్తారన్నారు. 45 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇస్తామన్న జగన్‌రెడ్డి చేతులెత్తేశాడని, చంద్రబాబు మహాశక్తి పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పటానికి సిద్ధమవుతున్నారన్నారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రమణక్కపేట ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే సమస్య పరిష్కరించాలని సాగుదారులు, లిబరేషన్ నాయకులు ముద్దరబోయిన దృష్టికి తేగా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.