ఉత్తరాంధ్రాలో నిరుద్యోగుల జీవితాలతో విశాఖలోని కొన్ని సంస్థలు ఆటలాడుకుంటున్నాయి. మంచి ఉద్యోగం ఇప్పిస్తామని సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకుంటున్నాయి. మీరు కట్టిన మొత్తం ఆరు నెలల్లో జీతం రూపంలో వెనక్కి వచ్చేస్తుందని, ఆ తరువాత సంతోషంగా ఉద్యోగం చేసుకోవచ్చునని నమ్మించి బుట్టలో వేసుకుంటున్నాయి. వందలాది మందితో డిపాజిట్లు కట్టించుకున్న తరువాత బోర్డు తిప్పేస్తున్నాయి. గత నెలలో ద్వారకానగర్‌లో ఓ సంస్థ ఇలాంటి మోసమే చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్లు స్కానింగ్ చేసే ఉద్యోగం అంటూ ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు వసూలుచేసింది. సుమారు 150 మంది వద్ద డబ్బులు తీసుకొని బోర్డు తిప్పేసింది. ఇదంతా ఒక మహిళ చేయడం గమనార్హం. బాధితులు ద్వారకా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఆ సంస్థకు అధికార పార్టీ పెద్దల సహకారం ఉండడంతో కనీసం కేసు కూడా నమోదు చేయలేదు.