బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఆందోళనలు సోమవారం నాటికి 1287వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుండి వారు మాట్లాడుతూ, జీవనాధారమైన భూములిచ్చిన రైతుల్ని మూడు రాజధానులంటూ పాలకులు నడిరోడ్డు మీద నిలబెట్టారన్నారు. చట్టబద్ధంగా ఒప్పందం చేసుకొని భూములిస్తే.. ఆ చట్టాన్ని కూడా అతిక్రమిస్తూ బయట ప్రాంతం పేదలకు ఇంటిస్థలాలు అంటూ, అమరావతి మాస్టర్ ప్లాన్‌ను నిర్వీర్యం చేసి, విలువ లేకుండా చేయాలని ఆర్-5 జోన్‌ని తెచ్చారన్నారు. ప్రతి రోజు రైతులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల హక్కులను కాలరాయవద్దు.. అమరావతిని అభివృద్ధి చేయండని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా ధిక్కారానికి పాల్పడుతున్నారన్నారు. వెలగపూడి, తుళ్లూరు, నెక్కల్లు వెంకటపాలెం, మందడం, ఉద్దండ్రాయునిపాలెం తదితర రాజధాని గ్రామాలలో వారి ఆందోళనలు కొనసాగాయి. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు.