రాబోయే ఆరు నెలల కాలంలో గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పెద్ద ఎత్తున పేద రోగులకు గుండె శస్త్రచికిత్సలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రముఖ గుండె మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు, పద్మశ్రీ అవార్డుగ్రహీత డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే తెలిపారు. సోమవారం ప్రభుత్వాస్పత్రిలో సహృదయ ట్రస్ట్ సౌజన్యంతో గుండె శస్త్రచికిత్సలను తిరిగి ప్రారంభించారు. కొవిడ్-19 వల్ల కొంతకాలంగా జీజీహెచ్‌లో హృద్రోగ శస్త్రచికిత్సలను నిలిపివేసిన నేపథ్యంలో పేద రోగులు ఇబ్బందులు పడకూడదనే ధ్యేయంతో తిరిగి గుండె ఆపరేషన్లను ప్రారంభించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సహృదయ వ్యవస్ధాపకులు డాక్టర్ గోఖలే స్వయంగా సోమవారం హృద్రోగికి మైట్రల్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ సర్జరీ నిర్వహించారు. చెడిపోయిన హృదయ కవాటం తొలగించి దాని స్థానంలో కృత్రిమ కవాటం ఏర్పాటు చేశారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ గోఖలేతో పాటు డాక్టర్ చంద్రకుమార్, డాక్టర్ విజయలక్ష్మీ, డాక్టర్ సుధాకర్, డాక్టర్ రామరాజు పాల్గొన్నారు. ఆపరేషన్ అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ ప్రభావతితో కలసి గోఖలే విలేకర్లతో మాట్లాడారు. గతంలో సహృదయ ట్రస్ట్ ద్వారా గుండె ఆపరేషన్లు జీజీహెచ్‌లో చేశామని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ ఆపరేషన్లు జరుగుతాయని ఆయన తెలిపారు. తాను వ్యక్తిగతంగా హాజరై ఇక్కడి వైద్యులకు ఆపరేషన్ల నిర్వహణలో సలహాలు, సూచనలు అందిస్తానన్నారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కొద్ది రోజుల్లోనే డిశ్చార్జీ చేస్తామని డాక్టర్ గోఖలే తెలిపారు. కాగా గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, మాతృ విద్యా సంస్థకు తన వంతు చేయూతనివ్వడం పట్ల డాక్టర్ ప్రభావతి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ ఆర్‌ఎంవో డాక్టర్ బీ సతీష్‌కుమార్, అడ్మినిస్ట్రేటర్ బీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.