రోగ నిర్ధారణ పరీక్షలు పక్కగా నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు సూచించారు. ఈ మేరకు ఆయన సీతానగరం మండలం మరిపివలస గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు జరిపిన ఆరోగ్య తనిఖీలు, పరీక్షల నివేదికలని పరిశీలించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాదులు ప్రబలే అవకాశం ఉన్నందున రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంచి పక్కగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాలు గుర్తిస్తే వెంటనే చికిత్స అందజేసి క్షేత్ర స్థాయిలో నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా గర్భిణీలు అందరికీ ఆరోగ్య తనిఖీలు ఖచ్చితంగా చేపట్టి, ప్రసవ సమయం దగ్గర పడుతున్న గర్భిణీల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ఎటువంటి ప్రమాదకర సూచనలు గుర్తించిన వెంటనే తగు చికిత్స అందజేయాలన్నారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన గర్భిణీ లకు డిఐఒ జగన్మోహనరావు స్వయంగా బిపి చూసి ఆరోగ్య పరిశీలన చేశారు. హై రిస్క్ గర్భిణీ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కె. శిరీష, సూపర్ వైజర్ జయగౌడ్, వైద్య సిబ్బంది గౌరి, శ్రావణి, చంద్రనాయుడు, 104 సిబ్బంది. దుర్గాప్రసాద్, ప్రసాద్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.