మనం వాడే స్మార్ట్‌ఫోన్లను వార్తాపత్రికలాగా మడతపెట్టేసుకునేలా ఉంటే బాగుంటుంది కదూ. కానీ, ప్రస్తుతం మనం వాడే బ్యాటరీల వల్ల అది సాధ్యం కాదు. ఎలా పడితే అలా వంచేసుకునే సౌలభ్యం ఉన్న(ఫ్లెక్సిబుల్) బ్యాటరీలు వస్తే మాత్రం అది సాధ్యమే. అలాగే.. కొన్ని రకాల బ్యాక్టీరియాలను తినేసే డిజైనర్ వైర్‌సలను, పరాన్నజీవులను తయారుచేస్తే ఆహార సరఫరాలో బ్యాక్టీరియా సమస్యలను అధిగమించవచ్చు. జీవుల కణాల్లో పరమాణు స్థాయిలో జరిగే ప్రక్రియలను చూడగలిగే స్పేషల్ ఓమిక్స్, మొక్కల ఆరోగ్యాన్ని కనిపెట్టుకుని ఉండే పరికరాలు, కర్బన ఉద్గారాలను అతి తక్కువగా విడుదల చేసే విమాన ఇంధనం ఇలా చాలా టెక్నాలజీలు భవిష్యత్తును ఏలబోతున్నాయని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది.