కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో ఉన్న బాలికల జెడ్పీ హైస్కూల్‌లో అడ్మిషన్లు లేవంటూ బోర్డును ఏర్పాటు చేశారు. స్కూల్లో ఆరో తరగతిలో కొత్తగా చేరేందుకు వచ్చిన విద్యార్థినులను స్కూల్ ఇంఛార్జ్ ప్రధానోపాధ్యాయిని తిప్పి పంపారు. సీట్లు లేవని చెప్పడంతో కొందరు తల్లిదండ్రులు హెచ్‌ఎంతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ బడిలో సీట్లు లేవని ఎలా చెబుతారని ప్రశ్నించారు. స్కూల్లో ఇప్పటికే 700కు పైగా దరఖాస్తులు వచ్చాయని స్టాఫ్ చెబుతున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి బాలికలు పాఠశాలలో చేరేందుకు తరలి వస్తున్నారట. టీసీ తెచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం ఉంటుందని ఎంఈవో అంటున్నారు. సీట్లు లేవు అని వెనక్కి పంపరాదని.. ఎవరైనా అలా చేస్తే ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్కూలుకు వెళ్లి విచారణ చేసి జిల్లా అధికారులకు సమాచారాన్ని ఇస్తామన్నారు.
నెల్లూరులో కూడా కేఎన్‌ఆర్ ప్రభుత్వ స్కూల్‌లో కూడా సీట్లకు డిమాండ్ ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్ల కోసం టీచర్లు తరగతులవారీగా విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈ ఏడాది కూడా అక్క సీట్లు ఫుల్ అయ్యాయి. దీంతో చాలామంది తల్లిదండ్రులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ప్రభుత్వ స్కూల్ అయినా సరే చుట్టుపక్కల ప్రాంతంలో మంచి పేరు ఉంది. పదో తరగతిలో కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది.. అందుకే ఈ స్కూల్‌లో సీట్ల కోసం పోటీపడతారు. ప్రతి ఏటా ఈ స్కూల్‌లో సీటు కోసం పోటీ ఉంటుంది.
ఈ స్కూల్‌లో పనిచేస్తున్న చాలా మంది ఉపాధ్యాయులు తమ పిల్లలను ఇక్కడే చదివిస్తున్నారు. ఇక్కడ మంచి టీచింగ్ స్టాఫ్ కూడా ఉందని స్థానికులు చెబుతుంటారు. నాణ్యమైన విద్యతో పాటుగా క్రమశిక్షణ ఉందని అందుకే తల్లిదండ్రులు ఇక్కడ చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం ఎలాంటి అడ్మిషన్ టెస్ట్‌లు ఉండవు.. కానీ ఇక్కడ మాత్రం ప్రైవేట్ స్కూల్‌లా సీట్ల కోసం పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తోంది.. స్కూళ్లలో నాడు నేడు కింది సౌకర్యాలను మెరుగుపరిచింది. అలాగే అమ్మఒడితో పాటుగా మధ్యాహ్న భోజనం, విద్యా కానుకల్ని అందిస్తోంది. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు బుధవారం సీఎం జగన్ కురుపాంలో అమ్మఒడి డబ్బుల్ని బటన్ నొక్కి తల్లుల అకౌంట్‌లలోకి విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.