జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. శ్యామ్‌ది ఆత్మహత్య కాదు హత్య అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. '#WeWantJusticeForShyamNTR' అంటూ ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు శ్యామ్ మిస్టరీ డెత్‌పై స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా చింతలూరుకు చెందిన శ్యామ్ మరణం దిగ్భ్రాంతి కలిగించింది అన్నారు. అతడి మరణం అనుమానం కలిగించే అంశాలు ఉన్నాయని.. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని.. దీనిపై నిస్పక్షపాతంగా దర్యాప్తు జరగాలన్నారు. పారదర్శకతతోనే న్యాయం జరుగుతుందని ట్వీట్ చేశారు.
శ్యామ్ మరణంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్యామ్ అనుమానాస్పద మరణం ఎంతో బాధ కలిగించింది అన్నారు లోకేష్. అతడి కుటుంబం, స్నేహితులకు తన సానుభూతిని తెలియజేశారు. ఈ కేసులో వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారని.. అందుకే ఎలాంటి పక్షపాతం లేకుండా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్యామ్‌కు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.
చింతలూరుకు చెందిన శ్యామ్ జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని. ఆ మధ్య విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హడావిడి చేసి హైలైట్ అయ్యాడు. ఈ వేడుకకు తారక్ ముఖ్య అతిథిగా రావడంతో.. అభిమాన హీరోను కలిసేందుకు స్టేజ్‌పై దూసుకెళ్లాడు. అక్కడున్న సెక్యూరిటీ అడ్డుకుని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఎన్టీఆర్ వారించి శ్యామ్‌ను పిలిచి మరీ ఫోటో దిగాడు. అప్పట్లో శ్యామ్ గురించి చర్చ జరిగింది.
తారక్ వీరాభిమాని అయిన శ్యామ్ మరణంపై అనుమానాలు రేగడంతో తోటి అభిమానులు స్పందిస్తున్నారు. పాత ఫొటో, వీడియోలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. శ్యామ్ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడని చెబుతండగా.. తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులతో పాటుగా స్నేహితులు, అభిమానులు చెబుతున్నారు. శ్యామ్‌ది ఆత్మహత్య కాదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్యామ్ ఆత్మహత్య చేసుకుని ఉంటే శరీరంపై గాయాలు ఉన్నాయంటున్నారు. చేతుల దగ్గర ఎవరో కోసినట్లు ఉందంటున్నారు.. శ్యామ్ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
శ్యామ్‌కు న్యాయం చేయాలంటూ ఎన్టీఆర్ అభిమానులు 'వుయ్ వాంట్ జస్టిస్ ఫర్ శ్యామ్ ఎన్టీఆర్' అంటూ ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. శ్యామ్‌కు మద్దతుగా నిలుస్తామని.. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తే బావుంటుంది అంటున్నారు. శ్యామ్ మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.