ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ సర్కార్ పై.... ‘నాలుగేళ్ల నరకం’ అంటూ టీడీపీ పోస్టర్ల పోరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 27, 2023, 08:10 PM

వైసీపీ సర్కార్ పై తాజాగా టీడీపీ పోస్టర్ల పోరును మొదలెట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘నాలుగేళ్ల నరకం’ ప్రచార కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొనసాగుతోంది. రెండో రోజు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొంటూ గణాంకాలతో సహా పోస్టర్లపై ముద్రించారు.


ముఖ్యంగా గుంటూరు, విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ఒంగోలు రైల్వే స్టేషన్ వంటి కీలక ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాల రేట్లు, వెనుకబడిన వర్గాలు, మహిళలపై జరుగుతున్న దాడులు, ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, పీజీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల తొలగింపు, రైతు ఆత్మహత్యలు, ఆగిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, ఎంఎన్‌సీ కంపెనీల తరలింపు, నిరుద్యోగం వంటి కొన్ని ప్రధాన అంశాలు పోస్టర్‌లపై హైలైట్ చేశారు.


అలాగే, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు పెరిగిపోయాయని పోస్టర్‌లో ప్రస్తావించారు. మహిళలపై దాడుల సంఖ్య 2020లో 7,039 ఉండగా 2021లో 10,373 నుంచి 2022 నాటికి 11,895కి పెరిగిందని.. మహిళలకు మరింత రక్షణ కల్పించాల్సిన ‘దిశా’ చట్టం ఇప్పటికీ అమలు కాలేదని పేర్కొన్నారు.


2023 పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం కేవలం 77 శాతంగా నమోదైందని.. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పోస్టర్‌లో వివరించారు. అంతకుముందు టీడీపీ హయాంలో ఉత్తీర్ణత శాతం ఎప్పుడూ 90 శాతం కిందకు పడిపోయిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. అలాగే, పీజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను రద్దు చేసిందని.. దీంతో పీజీ విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో చదువుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అలాగే, ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు కూడా పెంచకపోవడంతో విద్యార్థులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.


‘‘రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉంది. గడిచిన నాలుగేళ్లలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పక్క రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ ఖరీదు రూ. 15,000 అయితే, రాష్ట్రంలో అది రూ. 36,000 గా ఉంది. ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై తక్కువ పెట్టుబడి, పెరిగిన నిరుద్యోగం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈ కాలేజీలకు సూపరింటెండెంట్లు కూడా లేరు. ప్రభుత్వ వేధింపుల వల్ల 53 పరిశ్రమలు రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లిపోయాయి. కనీసం 0.5 శాతం విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి రాలేదు.


చిత్తూరు డెయిరీ ఆస్తులను 99 ఏళ్లకు గాను అమూల్‌ సంస్థకు అప్పగించారు. గడిచిన నాలుగేళ్లలో ఉద్యోగాల క్యాలెండర్ ఎక్కడ వేసిన గొంగిలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఒక్క డీఎస్సీ పరీక్ష కూడా జరగలేదు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత యువతలో నిరుద్యోగిత రేటు 35.1 శాతంగా ఉంది.’’ అని టీడీపీ దుయ్యబట్టింది.


మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని చెబుతూ ఈ పోస్టర్ల చర్చను సోషల్ మీడియాలోనూ టీడీపీ విస్తృతంగా ప్రచారం చేపట్టింది. రాబోయే రోజుల్లో ‘నాలుగేళ్ల నరకం’ అనే ఈ క్యాంపెయిన్‌ను మరింత విస్తృతం చేయనున్నట్లు టీడీపీ నాయకులు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నట్లు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రజలు ఈ ర్యాలీల్లో పాల్గొనడంతో పాటు సోషల్ మీడియా క్యాంపెయిన్‌లో కూడా భాగస్వాములు కావాలని టీడీపీ పిలుపునిచ్చింది. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను #NalugellaNarakam అనే హ్యాష్‌ట్యాగ్‌లో సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com