పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ఉన్మాదానికి ఎక్కువ, పిచ్చికి తక్కువ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితి బాగోలేదని, ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని పవన్ కళ్యాణ్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. కాకినాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సవాల్‌కు పవన్ కళ్యాణ్ తోక ముడిచారన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర అట్టర్ ఫ్లాప్ అని ఆయన అన్నారు.
ఇక, ప్రతి గొడవలోనూ జనసేన పార్టీ కార్యకర్తలే ఉంటున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తమ కార్యకర్తలను గూండాలు, రౌడీలుగా తయారు చేసేలా పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారని చెప్పారు. రాష్ట్రం అగ్నిగుండంగా మారిందంటూ చంద్రబాబు, పవన్ ఇద్దరూ కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడమే ఆలస్యం అందర్నీ లోపల వేసేస్తారట.. దాని కోసం మీకు ఓటు వేయాలా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు అసలు పుత్రుడు, దత్తపుత్రుడికి దమ్ముంటే తమ ఐదేళ్ల పరిపాలన చూసి ఓటు వేయమని చెప్పమనాలని పేర్కొన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏ రోజూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదన్నారు.
తమ పరిపాలనను చూసి ఓట్లు వేయాలని తాము అడుగుతున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మీరు 2014- 19 పరిపాలన చూసి ఓటు వేయమని అడగగలరా అని సవాల్ విసిరారు. చంద్రబాబునాయుడు లాంటి చండాలుడు రాష్ట్రానికి అవసరం లేదనేది ప్రజల అభిప్రాయమన్నారు. 219 దేవాలయాలు కూల్చేశామని పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారని చెప్పారు. గుళ్లు కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబు కదా అని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ హయాంలోనే కదా రాష్ట్రంలో గుళ్లని కూల్చేసిందని నిలదీశారు. ఆ సమయంలో దేవాదాయ శాఖ మంత్రి బీజేపీ నేత కాదా అని ప్రశ్నించారు. కూల్చేసిన గుళ్లను సీఎం జగన్ పునఃనిర్మిస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.