శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో ఘోరమైన సంఘటన జరిగింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. కుప్పిలి గ్రామానికి కొండ్ర కుప్పయ్యకు భార్య హరమ్మ, ఇద్దరు కుమారులు తాతారావు(26), కామరాజు, ఇద్దరు కుమార్తెలు అప్పయమ్మ (వివాహిత), లక్ష్మి ఉన్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుప్పయ్య గత కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు తగాదాలకు దిగేవాడు. భార్యాభర్తల గొడవలపై గ్రామంలో పలుమార్లు పంచాయితీ కూడా జరిగింది. అయినా కుప్పయ్య వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోగా, భార్యతో పాటు ఆమెను సహకరిస్తున్న కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకున్నాడు. ఒకే ఇంట్లో వీరంతా ఉన్నప్పటికీ కుప్పయ్య, మిగిలిన కుటుంబ సభ్యులు వేర్వేరుగా రెండు పొయ్యలు పెట్టుకుని వంట చేసుకుంటున్నారు. కుమారులు ఇద్దరూ విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాలకు ఉపాధి రీత్యా వెళ్లి వస్తుంటారు. ఇటీవల గ్రామంలో సంబరాలు జరగడంతో కుమారులు, కుమార్తెలు వచ్చి అంతా ఒకే చోటే ఉన్నారు. ఇదే అదునుగా చూసుకుని కుప్పయ్య కుటుంబ సభ్యులను హతమార్చాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి అందరూ నిద్రిస్తుండగా ముందుగా సిద్ధంగా చేసుకున్న కత్తితో పెద్ద కుమారుడు తాతారావుపై ఒక్క ఉదటున దాడిచేశాడు. అతను బిగ్గరగా కేకలు వేస్తూ ప్రాణాలు విడిచాడు. దీంతో మిగిలిన కుటుంబ సభ్యులంతా నిద్ర నుంచి మేల్కొన్నారు. ఆ తర్వాత భార్య హరమ్మను చంపేందుకు ప్రయత్నించగా చిన్నకుమారుడు కామరాజు అడ్డుకోవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో హరమ్మ కూడా గాయపడింది. దీంతో భయానక వాతావరణం ఏర్పడడంతో మిగిలిన కుటుంబ సభ్యులంతా పరుగులు తీశారు. ఇరుగుపొరుగు కుటుంబాలు ఇళ్ల నుంచి బయటకు రావడంతో కుప్పయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన కామరాజు, హరమ్మలను శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. కామరాజును మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. శ్రీకాకుళం డీఎస్పీ శృతి, జేఆర్‌పురం సీఐ ఆదాం సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఏఎస్‌ఐ కృష్ణారావు కేసు నమోదు చేయగా, సీఐ ఆదాం దర్యాప్తు చేస్తున్నారు.