అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేయగా కనీసం పెట్టుబడులు గిట్టుబాటు కాలేదు. మరో పక్క అప్పులు ఇచ్చిన వారు ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ యువరైతు పంటపొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుల కథనం మేరకు..ప్రొద్దుటూరు పరిధిలోని బ్రహ్మంగారిమఠం మండలం చెంచయ్యగారిపల్లెకు చెందిన ఓబుగాని బాలనరసింహులు(30)కు రెండెకరాల పొలం ఉంది. దీంతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుండేవాడు. మూడు సంవత్సరాల నుంచి వరి, పత్తి, మిరప సాగు చేశాడు. దిగుబడులు సరిగా లేకపోవడం, దిగుబడులు ఉన్నప్పుడు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. దీనికి తోడు ఇటీవల గొర్రెలు పాలికి తీసుకుని మేపుతున్నాడు. వాటికి రోగాలు వచ్చి కొన్ని గొర్రెలు చనిపోయాయి. మరికొన్ని వాటికి జబ్బు రావడంతో మందుల ఖర్చు ఎక్కువగా అయింది. అయితే గొర్రెల యజమానులు ఇంటి వద్దకు వచ్చి ఉన్న గొర్రెలను వెనక్కి తీసుకుని పోగా చనిపోయిన గొర్రెలకు డబ్బులు కట్టివ్వమని వత్తిడి చేశారు. వ్యవసాయంలో నష్టపోవడం, గొర్రెలు మేపడానికి, వాటి జబ్బులకు మందులకోసం సుమారు రూ.12లక్షలు అప్పులయ్యాయి. దీనికి తీడు ఇటీవల అప్పులవాళ్లు తమ డబ్బులకోసం ఒత్తిడి పెంచారు. దీంతో అప్పులు తీరే మార్గం లేక మనస్తాపానికి గురైన బాలనరసింహులు మంగళవారం ఉదయం 7గంటల సమయంలో పొలం వద్ద పురుగుల మందు తాగి గట్టు మీద పడిపోయాడు. పక్క పొలాల్లో ఉన్న వారు గుర్తించి అతడి తండ్రి నరసింహులుకు విషయాన్ని తెలియజేయడంతో హుటాహుటిన 108 వాహనం సాయంతో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కడప రిమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. మృతుడి తండ్రి నరసింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బి.మఠం పోలీసుస్టేషన్ ఎస్‌ఐ విద్యాసాగర్ తెలిపారు. కాగా.. మృతుడు బాల నరసింహులు భార్య శిరీష, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.