గుంటూరు జిల్లా తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో వీరి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఎంపీ అయోధ్య రామిరెడ్డి రంగంలోకి దిగారు. తాను చెప్పిన పనులు నగరపాలక సంస్థ అధికారులు చేయటం లేదని ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. పనులు కాకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపణలు గుప్పించారు. నియోజకవర్గంలో తనకు తెలియకుండా పనులు చేస్తున్నారని ముస్తఫా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఎంపీ... ఇద్దరు నేతలను వెంట పెట్టుకుని నగరంలో సమస్యలు నెలకొన్న ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మేయర్, ఎమ్మెల్యే, అధికారులతో కలిసి ఎంపీ అయోధ్య రామిరెడ్డి సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకపోవడం వల్లే సమస్య వచ్చిందని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ సమస్యలు పరిష్కరించాలని ఇరువురు నేతలకు ఎంపీ అయోద్య రామిరెడ్డి సూచనలు చేశారు.