ప్రేమ పేరుతో యువతి ఫోటో లను మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేసాడు ఓ యువకుడు. భయబ్రాంతులకు గురైన బాధిత యువతి దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదనందిపాడుకు చెందిన ప్రవీణ్ అనే యువకుడు స్థానికంగా వుండే యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. చనువుగా ఉంటూ యువతిని ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నించాడు. ప్రవీణ్ దురుద్ధేశాన్ని గ్రహించిన యువతి దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను చూపించి యువతిని బ్లాక్ మెయిల్ చేసాడు. భయబ్రాంతులకు లోనైన యువతి దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది.
బాధిత యువతి దిశ SOS కు కాల్ చేసిన పది నిమిషాల వ్యవధిలోనే పెదనందిపాడు లో ఉన్న యువతి వద్దకు పోలీసులు చేరుకున్నారు. ప్రవీణ్ మార్ఫింగ్ చేసిన ఫోటోలను దిశ టీం సేకరించారు. బాధిత యువతికి ధైర్యం చెప్పి భరోసా ను కల్పించారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రవీణ్ పై ఐపీసీ సెక్షన్ 354 A, 354 D, 323, 506 సెక్షన్ కింద పెదనందిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలను వేధింపులకు గురిచేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని దిశ పోలీసులు హెచ్చరించారు.