ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ యూనివర్సిటీ ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Fri, Jun 30, 2023, 10:18 PM

ఢిల్లీ యూనివర్సిటీలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సావాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని వివిధ కాలేజీలు.. తమ విద్యార్థులు, ఉద్యోగులకు కీలక మార్గదర్శకాలు జారీ చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు ఎవరూ నల్ల రంగు దుస్తులు ధరించవద్దని యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలన్నీ మార్గదర్శకాలు జారీ చేశాయి. ఈ యూనివర్సిటీ ముగింపు కార్యక్రమంలో విద్యార్థులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆయా కళాశాలలు తమ నోటీసుల్లో పేర్కొన్నాయి.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్న ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమం లైవ్‌ స్ట్రీమింగ్‌కు విద్యార్థులు అందరూ హాజరు కావాలని పేర్కొన్నారు. యూనివర్సిటీలో ట్రాఫిక్‌, ఇతర అడ్డంకులు ఏర్పడకుండా ఉదయం 9 గంటల లోపే అందరూ కళశాలకు రావాలని ఆదేశించారు. ఎవరూ ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ డ్రెన్‌లు వేసుకోవద్దని ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన హిందూ కాలేజ్‌ సహా యూనివర్సిటీ పరిధిలోని పలు కళాశాలలకు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు అందరూ కళాశాలలో జరుగుతున్న వర్చువల్ కార్యక్రమానికి హాజరుకావాలని డాక్టర్ భీమ్‌రావ్‌ కళాశాల ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇలా ఆంక్షలు పెట్టడం ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదం అయింది.


ప్రధాని పర్యటన వేళ యూనివర్సిటీ పరిధిలో ఆంక్షలు విధించారని వస్తున్న వార్తలపై ఆయా కళాశాలు స్పందించాయి. అలాంటి నోటీసులు ఏమీ జారీ చేయలేదని హిందూ కాలేజ్ ప్రిన్సిపల్‌ అంజు శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ఇలాంటి ఆదేశాలపై తమకు ఏ విధమైన సమాచారం లేదని చెప్పారు. ఆంక్షలు, ఆదేశాలపై ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న పలు కళాశాలల యాజమాన్యాలు కూడా ప్రకటనలు విడుదల చేశాయి. ప్రధాని కార్యక్రమానికి హాజరు కావాలని మాత్రమే ఉద్యోగులు, విద్యార్థులకు సూచించామని.. అయితే అది తప్పనిసరి అని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని వెల్లడించాయి.


మరోవైపు.. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పలువురు విద్యార్థులను ముందుస్తు అరెస్టులు చేసినట్లు విద్యార్థి సంఘాలు వెల్లడించాయి. ప్రధానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తారనే ఉద్దేశంతోనే పలువురిని హౌస్ అరెస్టులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాని పర్యటన కారణంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ - ఏఐఎస్ఏ నాయకులను నిర్బంధించినట్లు వారు తెలిపారు. తనతోపాటు ఢిల్లీ యూనివర్సిటీ సెక్రటరీ అంజలిని వారి హౌస్ అరెస్ట్ చేసినట్లు ఏఐఎస్ఏ ఢిల్లీ అధ్యక్షుడు అభిజ్ఞాన్ ట్వీట్ చేశారు. తమ కార్యకర్తలను కూడా యూనివర్సిటీ క్యాంపస్‌లోకి అనుమతించలేదని తెలిపారు. తమను నిర్భందించడానికి ఎటువంటి వారెంట్ గానీ లేదా ఆర్డర్ గానీ చూపలేదని.. ఎంతకాలం ఇలా బంధిస్తారో కూడా తెలియదని అభిజ్ఞాన్‌ చెప్పారు. అయితే ఏ విద్యార్థిని కూడా అదుపులోకి తీసుకోలేదని ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com