తమిళనాడులో గవర్నర్ ఆర్ ఎన్ రవి వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశమవుతోంది. గవర్నర్, డీఎంకే ప్రభుత్వం మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా ఉండగా.. దానికి మరింత ఆజ్యం పోసే పరిణామం గురువారం చోటుచేసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సెంథిల్ బాలాజీని స్టాలిన్ క్యాబినెట్ నుంచి తొలగిస్తూ గవర్నర్ రవి అనూహ్యంగా ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదమయ్యింది. అయితే, అంతలోనే అటార్నీ జనరల్‌తో సంప్రదింపుల కోసమంటూ ఆ ఉత్తర్వులను ఆయన తాత్కాలికంగా నిలుపుదల చేయడం గమనార్హం.
అన్నాడీఎంకే హయాంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసినట్టు ఆరోపిస్తూ ఇటీవల మంత్రి సెంథిల్ బాలాజీ నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి శాఖ లేని సెంథిల్ బాలాజీని క్యాబినెట్ నుంచి తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ‘ఉద్యోగాల ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేయడం, మనీ ల్యాండరింగ్ సహా పలు తీవ్రమైన నేరారోపణలను మంత్రి సెంథిల్ బాలాజీ ఎదుర్కొంటున్నారు.. అందుకే ఆయనను మంత్రి వర్గం నుంచి గవర్నర్ తొలగించారు’ అంటూ ఈ మేరకు రాజ్‌భవన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
చివరకు అటార్నీ జనరల్‌తో ఈ అంశాన్ని సంప్రదించి తుది నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఆ ఉత్తర్వులను నిలుపుదల చేసినట్లు గవర్నర్ కార్యాలయ వర్గాలు రాత్రి వెల్లడించాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌కు తెలియజేశాయి. అయితే, ముఖ్యమంత్రి స్టాలిన్‌ను సంప్రదించకుండానే క్యాబినెట్ నుంచి మంత్రిని గవర్నర్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి.
గవర్నర్ అసాధారణ చర్యపై ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఓ మంత్రిని క్యాబినెట్‌ను తొలగించే అధికారం గవర్నర్‌కు లేదన్నారు. ఈ అంశాన్ని తమ ప్రభుత్వం న్యాయపరంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. మంత్రిని తొలగించడాన్ని భాజపాయేతర ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ‘ఈ చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే’ అని అభివర్ణించాయి.