ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాగ్ రాజ్‌లో అతీక్ అహ్మద్ స్థలం స్వాధీనం

national |  Suryaa Desk  | Published : Fri, Jun 30, 2023, 10:46 PM

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ కమ్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్ ఆస్తులను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ స్వాధీనం చేసుకున్న స్థలంలో పేదలకు యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఇళ్ల నిర్మాణం చేపట్టింది. వీటిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగి.. అక్కడి లబ్దిదారుల పిల్లలు, చిన్నారులతో మాట్లాడారు. దీంతో పాటు నగరంలోని మరో 226 అభివృద్ధి పనులను యోగి ఆదిత్య నాథ్ ప్రారంభోత్సవాలు చేశారు.


ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. ‘2017కి ముందు ఏ మాఫియా అయినా పేదలు, వ్యాపారులు లేదా ప్రభుత్వ సంస్థల భూమిని లాక్కునే రాష్ట్రం ఇదే. అప్పుడు పేదలు నిస్సహాయంగా చూసేవారు.. ఇప్పుడు మనం అదే భూమిలో పేదలకు ఇళ్లను నిర్మిస్తున్నాం... ఈ మాఫియాల నుంచి స్వాధీనం చేసుకున్నారు.. ఇది ఒక పెద్ద విజయం’ అని అన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన ఫ్లాట్లలో 76 తాళాలను సీఎం చేతుల మీదుగా లబ్దిదారులు అందుకున్నారు. ఉచితంగా ప్రభుత్వం ఫ్లాట్లను అందజేయడంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఓ లబ్ధిదారుడు మాట్లాడుతూ మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా గొప్పగా అనిపిస్తోంది.. సొంత ఇల్లు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి వెళ్లమని ఎవరూ చెప్పరు..’’ అని అన్నారు. అంతకు ముందు జూన్ 9న అతిక్ అహ్మద్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన మొత్తం 76 ఆరు ఫ్లాట్లను లాటరీ పద్ధతిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ లబ్దిదారులకు కేటాయించారు.


ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీడీఏ) ఉపాధ్యాక్షుడు అర్వింద్ చౌహాన్ మాట్లాడుతూ.. అతిక్ అహ్మద్ నివాసం ఉంటున్న నగరంలో అతడి భూమిని స్వాధీనం చేసుకుని కార్యాలయాన్ని కూడా నడుపుతున్నామని అన్నారు. ఈ స్థలంలో 76 ఫ్లాట్ల నిర్మాణాన్ని అథారిటీ పూర్తి చేసి లాటరీ ద్వారా పేదలకు కేటాయించిందని చెప్పారు.


ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఫ్లాట్లను కేటాయించినట్లు చౌహాన్ వివరించారు.


ప్రతీ ఫ్లాట్‌‌లో అధునాతన సౌకర్యాలు ఉన్నాయని, బెడ్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, టాయిలెట్, బాత్రూం, బాల్కనీ, విద్యుత్, మురుగునీటి పారుదల, పార్కింగ్ సదుపాయం ఉందన్నారు. కేవలం రూ.3.5 లక్షలకే లబ్దిదారులకు 41 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్లు అందజేస్తున్నారు. మొత్తం 6,030 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 1,590 మందిని లాటరీకి అర్హులుగా గుర్తించామని అర్వింద్ చెప్పారు. మొత్తం 1,731 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్ల నిర్మాణానికి యోగి 2021 డిసెంబరు 26న శంకుస్థాపన చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com