ఈ ఏడాది ఆరంభంలో అమెరికా గగనతలంలో చైనా బెలూన్లు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ బెలూన్లు తమపై నిఘా కోసం వినియోగించినట్టు తాజాగా అమెరికా స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ గూఢచర్య బెలూన్ కోసం అమెరికా సాంకేతికతనే ఉపయోగించిందని పేర్కొంది. ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. తమ గగనతలంలోని చైనా బెలూన్‌ను అమెరికా కూల్చివేసి శకలాలను సేకరించిన రక్షణ శాఖ, నిఘా సంస్థలు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి.
ఈ బెలూన్‌లో అమెరికన్ గేర్‌తో పాటు ప్రత్యేకమైన చైనీస్ సెన్సార్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ సాంకేతికత సాయంతో అమెరికాలోని కీలక ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని సేకరించే ఉద్దేశంతో నిఘా బెలూన్‌ను చైనా పంపినట్టు అమెరికా విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు ఆ కథనం పేర్కొంది. చైనా చెబుతున్నట్టు ఇది వాతావరణ పరిశోధనల కోసం ప్రయోగించిన బెలూన్ కాదని.. అమెరికాపై నిఘా ఉద్దేశంతోనే దీన్ని పంపినట్టు దర్యాప్తు అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జనవరి చివరి నుంచి ఫిబ్రవరి మొదటివారంలో అలస్కా, కెనడాతో పాటు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల గగనతలాల మీదుగా ఎనిమిది రోజుల పాటు ఈ బెలూన్ ప్రయాణించింది. అయితే, ఈ సమయంలో ఎలాంటి డేటాను చైనాకు చేరవేసినట్లు ఆధారాలు లభించలేదని పెంటగాన్ అధికార ప్రతినిధి ప్యాట్ రైడర్ పేర్కొన్నారు. బెలూన్ ద్వారా గూఢచార సేకరణను అడ్డుకోడానికి చర్యలు తీసుకున్నామని, కచ్చితంగా మేము చేసిన ప్రయత్నాలు దోహదపడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఈ దర్యాప్తు అంశాలపై అటు వైట్‌హౌస్ గానీ.. ఇటు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గానీ స్పందించలేదు.
చైనాకు చెందిన ఓ భారీ బెలూన్ దక్షిణ కరోలినా సహా పలు అమెరికా రాష్ట్రాల్లో కన్పించింది. అణు క్షిపణుల ప్రయోగ కేంద్రం ఉన్న మోంటానా మీదుగా ఈ బెలూన్ ప్రయాణించడంతో అమెరికా దీన్ని తీవ్రంగా పరిగణించింది. యుద్ధ విమానాన్ని ప్రయోగించి ఫిబ్రవరి 4న దీన్ని కూల్చివేసింది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తన చైనా పర్యటనను కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
అటు, చైనా మాత్రం ఇది గూఢచర్య బెలూన్ కాదని, వాతావరణ అధ్యయనం కోసం ప్రయోగించిన ఈ వస్తువు పొరపాటున అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని సమర్ధించుకుంది. కానీ, బెలూన్‌లోని ఉన్న అనేక యాంటెన్నాలు సహా జియో లోకేటిక్ కమ్యూనికేషన్లను సేకరించే సామాగ్రి ఉందని అమెరికా అధికారులు వెల్లడించారు. ‘ఇది బహుళ యాక్టివ్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ సెన్సార్‌లను ఆపరేట్ చేయడానికి.. అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయడానికి తగినంత పెద్ద సౌర ఫలకాలను కలిగి ఉంది’ అని చెప్పారు.