ఆఫ్రికా దేశం కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ట్రక్కు అదుపుతప్పి వాహనాలను ఢీకొట్టి, పాదచారులపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో కనీసం 48 మంది ప్రాణాలు కోల్పోగా.. డజన్ల కొద్దీ గాయపడ్డారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి పశ్చిమ కెన్యాలో రద్దీగా ఉండే లొండియాని జంక్షన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రక్ అదుపుతప్పి ఇతర వాహనాలను ఢీ కొనడంతోపాటు పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ 48 మంది మృతి చెందినట్లు స్థానిక పోలీస్ కమాండర్ జియోఫ్రే మయేక్ తెలిపారు.
మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కులో ఒకరో ఇద్దరో చిక్కుకుని ఉంటారని చెప్పారు. ప్రమాద స్థలిలో బీతావాహ వాతావరణం నెలకుందని, ట్రక్కు ఢీకొట్టడంతో పలు మినీ బస్సులు నుజ్జునుజ్జుయ్యాయని ఆయన పేర్కొన్నారు. వాహానాలు లోపలి చిక్కుకున్నవారిని అతికష్టంతో బయటకు తీస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 30 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించామని పోలీస్ కమాండర్ అన్నారు. కెరిచో, నకూరు పట్టణాలను కలిపే జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కెరిచో వైపునకు వస్తున్న ట్రక్కు అదుపుతప్పి ఎనిమిది మినీ బస్సులు, పలు ద్విచక్రవాహనాలు, రోడ్డు పక్కన ఉన్నవారిపైకి దూసుకెళ్లిందని రిఫ్ట్ వ్యాలీ రీజినల్ పోలీస్ కమాండర్ టామ్ బోయో ఒడెరో తెలిపారు. ఈ ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంపై విచారణ చేపడతామని కెన్యా రవాణా మంత్రి కిప్చుంబా ముర్కోమెన్ ప్రకటించారు.
తమ ఆస్పత్రిలోని మార్చురీలో ఇప్పటి వరకూ 45 మృతదేహాలను భద్రపరిచామని, కొన్నింటిని ఇతర ఆస్పత్రులకు తరలించారని కెరిచో కౌంటీ ఆస్పత్రి సీనియర్ డాక్టర్ కొలిన్స్ వెల్లడించారు. ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. ‘ట్రక్కు అతివేగంతో దూసుకుపోతోంది. ఇది నేరుగా మార్కెట్‌లోకి రాకముందే అనేక వాహనాలను తప్పించేందుకు ప్రయత్నించింది’ అని చెప్పారు. ‘నేను చెప్పగలిగేది ఏమిటంటే, నేను ప్రాణాలతో ఉండటం అదృష్టవంతుడిని ఎందుకంటే ఏం జరిగిందో చూశాను.. నేను పరిగెత్తడంతో బతికిపోయాను.. నేను అదృష్టవంతుడ్ని’ అని మరొకరు భయానక ఘటనను గుర్తుచేసుకున్నారు. లిప్త కాలంలో ఘోరం జరిగిపోయిందని, ప్రమాదం నుంచి తప్పించుకోడానికి కొందరికి అసలు సమయం లేదని మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.