కండలు మెలితిరిగిన దేహంతో సోషల్ మీడియాలో భారీగా క్రేజ్ సంపాదించిన బాడీబిల్డర్ జో లిండ్నర్ హఠాన్మరణం చెందాడు. ఆన్‌లైన్‌లో జోస్తెటిక్స్ గా పాపులర్ అయిన ఈ జర్మన్ బాడీ బిల్డర్ మరణంతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి ఫాలోవర్లు విషాదంలో మునిగిపోయారు. లిండ్నర్ తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునేవాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి 9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. యూట్యూబ్‌లో అతడి వీడియోలకు 50 కోట్ల వ్యూస్ వచ్చాయి.
అనెయూరిజం అనే అరుదైన వ్యాధి కారణంగా లిండ్నర్ చనిపోయాడని తెలుస్తోంది. జో లిండ్నర్‌కు మూడు రోజుల క్రితం మెడనొప్పి వచ్చిందని.. దాని సీరియస్‌నెస్‌ను మేం తెలుసుకునేలోపే జరగకూడనిది జరిగిందని లిండ్నర్ గర్ల్ ఫ్రెండ్ నిచా వాపోయారు. తాను చూస్తుండగానే జో ప్రాణాలు కోల్పోయాడని నిచా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు అనెయూరిజం కారణంగా అతడు చనిపోయాడని నిచా తెలిపారు. అనెయూరిజం సమస్యతో బాధపడుతున్నవారిలో రక్త నాళాలు బలహీనంగా ఉంటాయి. రక్తనాళాల్లో అసాధారణమైన వాపు రావడం లేదా అవి ఉబ్బిపోయి చిట్లిపోవడం జరుగుతుంది. ఇది మరణానికి దారి తీస్తుంది.
శరీర సౌష్ఠవం కోసం స్టెరాయిడ్స్ తీసుకున్న వారిలోనూ ఇలాంటి సమస్య ఏర్పడుతుంది. జో మరణానికి బహుశా ఇది దోహదం చేసి ఉండొచ్చనే భావన వ్యక్తం అవుతోంది. లిండ్నర్ మరణం నేపథ్యంలో బాడీ బిల్డింగ్ కోసం అనుసరించే పద్దతులపై మరోసారి చర్చ జరుగుతోంది. జో లిండ్నర్ దుబాయ్, థాయ్‌లాండ్‌లో ఫిట్‌నెస్ వీడియోలను షూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో పోస్టు చేసేవాడు. ఈ వీడియోలు అతడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. జో కండరాల వ్యాధి ( రిపిలింగ్ మజిల్ డిసీజ్)తో బాధపడుతున్నట్లు తేలింది. ఈ వ్యాధి కారణంగా.. కండరాలు ఒత్తిడికి గురైన సమయంలో భిన్నంగా స్పందిస్తాయి. సాధారణంగా కండరాలపై ఒత్తిడి పెంచితే.. ఓ రకమైన రసాయనిక చర్య ద్వారా అవి మొత్తం ఒక చోటకు చేరి బలంగా కనిపిస్తాయి. కానీ, రిపిలింగ్ మజిల్ డిసీజ్ ఉన్నవారిలో కండరాలు విపరీతమైన ఒత్తిడికి గురై ఒకే కండరంలా కాకుండా వేర్వేరుగా అలల మాదిరి కనిపిస్తాయి. ఇలా కనీసం 20 సెకన్ల వరకు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో క్రాంప్ ఏర్పడి ఓ గడ్డలా వచ్చి విపరీతమైన నొప్పికి కారణం కావచ్చు. గత నెలలో తోటి బాడీబిల్డర్ బ్రాడ్లీ మార్టిన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకున్న కండరాల వ్యాధి గురించి లిండ్నర్ బయటపెట్టాడు.