రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్‌ను అజిత్ పవార్ అదునుచూసి దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి తేరుకున్న శరద్ పవార్.. తన గురువు, మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్‌కు గురుపూర్ణిమ సందర్బంగా సతారా జిల్లాలోని కరాడ్‌లో అతని స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. అన్ని ప్రతిపక్ష పార్టీలను బీజేపీ ‘నాశనం’ చేయడానికి ప్రయత్నిస్తోందని, ఎన్‌సీపీని పునర్నిర్మిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
‘నేడు మహారాష్ట్ర సహా దేశంలో కొన్ని వర్గాలు కులం, మతం పేరుతో సమాజం మధ్య చీలికను సృష్టిస్తున్నాయి’ అని ధ్వజమెత్తారు. తిరుగుబాటుదారులు తిరిగి వెనక్కి రావచ్చని, అయితే దీనికి కొంత సమయం ఉందని ఆయన అన్నారు. అంతేకాదు, ‘ఎన్సీపీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించిన వారిని అసలైన చోటుకు పంపుతాం’ అని పవార్ శపథం చేశారు.
అజిత్ పవార్ తిరుగుబాటుతో తాను అధైర్యపడలేదని, ప్రజల మధ్యకు వెళ్లడం ద్వారా మళ్లీ పునర్నిర్మిస్తానని ప్రకటించారు. ‘మతతత్వ శక్తులపై నా పోరాటం ఈరోజు ప్రారంభమవుతుంది.. అలాంటి తిరుగుబాట్లు జరుగుతాయి. నేను పార్టీని పునర్నిర్మిస్తాను’ అని పవార్ ఉద్ఘాటించారు. సమాజంలో భయోత్పాతాన్ని బీజేపీ సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.
సోమవారం ఉదయం పుణే నుంచి కరాడ్‌కు శరద్ పవార్ బయలుదేరగా.. మార్గమధ్యలో ఎన్‌సీపీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆయన మద్దతు తెలిపారు. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేతో కలిసి సీఎం ఏక్‌నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
కరాడ్‌లో శరద్ పవార్‌కు వేలాది మంది మద్దతుదారులు, స్థానిక ఎమ్మెల్యే బాలాసాహెబ్ పాటిల్ స్వాగతం పలికారు. ప్రమాణస్వీకారానికి ముందు అజిత్ పవార్ బంగ్లా వద్ద ఉన్న ఎమ్మెల్యే మకరంద్ పాటిల్ కూడా శరద్ పవార్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.