ఏపీ ప్రభుత్వం మరోసారి అప్పు తీసుకొచ్చింది. తాజాగా మరో 3 వేల కోట్ల అప్పును ఏపీ సర్కార్ తీసుకుంది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ. 3 వేల కోట్లు అప్పు చేసింది. వెయ్యి కోట్లు 11 సంవత్సరాలకు 7.46 శాతం వడ్డీతో, మరో వెయ్యి కోట్లు 16 సంవత్సరాలకు 7.52 శాతం వడ్డీతో రుణం పొందింది. ఇంకో వెయ్యి కోట్లు 20 సంవత్సరాలకు 7.46 శాతం వడ్డీతో రుణం తీసుకుంది. ఈ మూడు వేల కోట్లతో ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం రూ. 25 వేల 500 కోట్లు అప్పు తెచ్చింది. 90 రోజుల్లో రూ. 25 వేల కోట్లు అప్పు చేసింది. ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బిఎంలో ఇంక మిగిలింది ఐదు వేల కోట్లు మాత్రమే. కాగా ఈ 3 వేల కోట్ల రూపాయలు ఖజానాలో జమైతే వేతనాలు, పెన్షన్‌లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.