బాధల్లో ఉన్న బడుగుల సమస్యలపై స్పందించని వ్యవస్థలు ఎందుకు? వాటిని నిర్వీర్యం చేస్తున్న ఈ ప్రభుత్వం ఎందుకు? అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. అద్దంకి, పెనుగొండలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. అద్దంకిలో వైసీపీ నేతల వేధింపులపై ఫిర్యాదు చేసినా చర్యలు లేవని, పోలీ్‌సస్టేషన్ ముందే వెంకాయమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. పెనుగొండలో హుస్సేన్ అనే వ్యక్తి తన కుమార్తె 20 రోజులుగా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఆవేదనతోనే హుస్సేన్ ఆందోళనకు దిగారని అన్నారు. ఈ రెండు ఘటనలు రాష్ట్రంలో సర్వనాశనమైన వ్యవస్థలకు కళ్ల ముందు కనిపిస్తున్న ఉదాహరణలని చంద్రబాబు పేర్కొన్నారు.