ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మంగళవారం మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగింది. పదిహేను అంశాలను అజెండాలో పొందుపరచారు. అందులో ప్రధానంగా ఉంచిన ఐడీఎస్‌ఎంటీ కమర్షియల్ ప్లాట్ వ్యవహారంపై నెల రోజులుగా నగరంలో చర్చ నడుస్తోంది. 2007లో వేలం ద్వారా దక్కించుకుని, 2014లో ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ సమావేశంలో రద్దు చేసిన ప్లాటును తిరిగి పాటదారుడికి కట్టబెట్టేందుకు పురపాలక శాఖ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన అడ్డగోలు ఆదేశాలకు అధికారపార్టీ నేతలు తలూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మార్కెట్ ధర ప్రకారం రూ.3.12 కోట్లకు వేలం ద్వారా దక్కించుని మధ్యలో వివిధ కారణాలతో నిలిచిపోయిన ఆ స్థలం ధర ప్రస్తుతం రూ.13 కోట్లు పలుకుతోంది. అయితే అటు అధికార పార్టీ నేతలు, ఇటు అధికారుల తీరుతో పాత ధరకే కేటాయిస్తూ కౌన్సిల్ తీర్మానం చేసింది. ఈ అంశాన్ని డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు బలపరచగా, మిగిలిన వైసీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.అయితే ప్రతిపక్ష టీడీపీ కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య జీరో అవర్‌లో ఈ అడ్డగోలు వ్యవహారంపై ప్రశ్నించగా వైసీపీ కార్పొరేటర్లు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనంటూ అడ్డగించారు. కొలతలు తగ్గడంపై రమణయ్య అడిగిన ప్రశ్నకు అధికారులు సమాధానిమిస్తూ.. ప్లాట్ల వేలం సమయంలో డొంకతో కలిపి వేశారని, ఆ తర్వాత లేఅవుట్ ప్రకారం రోడ్లు వేయడంతో భూమిపై కొలతలు తగ్గాయని వివరించారు. మొత్తంగా మొదటి నుంచి వైసీపీ కార్పొరేటర్ల మధ్య నడుస్తున్న ఐడీఎస్‌ఎంటీ స్థలం కేటాయింపు వ్యవహారానికి మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశం ముగింపు పలికింది.