‘పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్‌రెడ్డి చేసిన విపరీత జాప్యం రాష్ట్రానికి శాపంగా మారింది. రాష్ట్రం పరువు మంటగలిపారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన పాపాన్ని జగన్ మూటకట్టుకొన్నారు’ అని టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరం నిర్మాణంపై కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ‘పోలవరం రిటైనింగ్ వాల్ మొత్తం ఎలా కుంగిపోయింది? గైడ్ బండ్‌ను రిటైనింగ్ వాల్ జాయింట్స్‌తో ఎందుకు నిర్మించారు? ఎగువ కాపర్ డ్యామ్ నుంచి నీరు ఎందుకు లీక్ అవుతోంది? గైడ్ బండ్, రిటైనింగ్ వాల్ ఫైలింగ్ ఎందుకు సవ్యంగా చేయలేకపోయారని కేంద్ర మంత్రి నిలదీశారు. ఇందులో దేనికీ ముఖ్యమంత్రి వద్ద సమాధానం లేదు. టీడీపీ హయాంలో కేంద్రం నుంచి అవార్డుల మీద అవార్డులు వస్తే ఇప్పుడు చీవాట్ల మీద చీవాట్లు పడుతున్నాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘జగన్ ధన దాహానికి పోలవరం బలైంది. చంద్రబాబు ఉండి ఉంటే ఈ ప్రాజెక్టు 2020 నాటికి పూర్తయిపోయేది.’ అని నిమ్మల అన్నారు.