కర్ణాటక, కేరళలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు స్కూళ్లు, కాలేజీలకు పలు జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. రోడ్లన్ని జలమయమయ్యాయి. అత్యవసరమైతేనే తప్పా బయటికి రావద్దని అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాల నేపథ్యంలో కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 2 జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 10 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ చేసింది. కేరళలోని ఇడుక్కి, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం, కొల్లాం మినహా 10 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అత్యవసర ఆపరేషన్ సేవలన్నీ తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇడుక్కి, మలప్పురం, అలప్పుజా, వాయనాడ్, కోజికోడ్, త్రిసూర్, పతనంతిట్ట జిల్లాల్లో ఏడు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. సోెమవారం కొట్టాయంలో 10 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదవగా, కొచ్చిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా కాసర్‌గోడ్ జిల్లాలో చెట్టు విరిగి పడడంతో 11 ఏళ్ల బాలిక మరణించింది.