టమాట ధరలకు రెక్కలొచ్చి కేజీ రూ. 100 పైనే పలుకుతున్న విషయం తెలిసిందే. దీంతో దొంగలు టమాటాలను టార్గెట్ చేశారు. తాజాగా, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో ఓ వ్యాపారికి చెందిన 20 కేజీల టమాటాలు, 4 కేజీల పచ్చిమిర్చిని దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే, కర్ణాటకలోను రూ. లక్ష విలువైన 60 బస్తాల టమాటాలను దొంగలు అపహరించుకుపోయారు. మహారాష్ట్రలో కూడా టమాటాల దొంగతనం జరిగింది.
రాష్ట్రంలో టమాట ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అమాంతం ధరలు పెరిగిపోవడంతో కొనేందుకు వినియోగదారులు సంకోచిస్తున్నారు. రాష్ట్రంలో టోకు మార్కెట్‌లో.. కిలో టమాట ధర రూ.72 ఉండగా.. రైతుబజార్లు, చిల్లర మార్కెట్లలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. జూన్ 1న ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా అధిక ఉష్ణోగ్రతలు, ఇటీవల పడిన వర్షాలు, తెగుళ్లు, చీడపీడల కారణంగా దిగుబడులు తగ్గగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.