ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం శ్రీకాకుళం ఏడురోడ్ల జంక్షన్‌లో ‘ప్రత్యేక హోదా సాధన జేఏసీ’ ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా కోరుతూ ధర్నా నిర్వహించారు. జేఏసీ చైర్మన్ చింతా రాజశేఖరరావు, ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే ప్రత్యేక హోదా మాత్రమే మార్గమని చెప్పారు. లేకుండా రాష్ట్రం మరింత దివాలా తీస్తుందన్నారు. విభజన చట్టంలో రూపొందించిన అంశాలన్నింటినీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఎం.రాజా శ్రీనివాసరావు, బీఎస్పీ గుంటూరు అధ్యక్షులు సీహెచ్ వాసు, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ఎస్.అన్నాజీరావు, బీసీ సంక్షేమ సంఘ నాయకులు చంద్రపతిరావు, ఆమ్ ఆద్మీ తదితర పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.