ఏపీలో మరోసారి స్థానిక సంస్థల పెండింగ్ పదవులకు ఎన్నిక నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా స్థానిక సంస్థల్లో రాజీనామా, ఆయా పదవుల్లో ఉన్నవాళ్లు మరణించడంతో ఖాళీ అయిన పదవులకు పరోక్ష పద్ధతిలో ఈ నెల 13న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులతో పాటు పెడన మున్సిపాలిటీలో చైర్పర్సన్ పదవిని భర్తీ చేస్తారు.
ధర్మవరం, మాచర్ల మున్సిపాలిటీల్లో రెండు వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. 13 మండలాల్లో నాలుగు ఎంపీపీ, ఏడు ఉపాధ్యక్ష, మూడు కో ఆప్షన్ సభ్యుల పదవులకూ ఎన్నికలు నిర్వహిస్తారు. వివిధ మండలాల్లో 12 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు కూడా ఎన్నికలు ఉంటాయని నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. ఈ నెల 13న ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటీసులను ఆయా స్థానిక సంస్థల సభ్యులకు ఈ నెల 9 కల్లా అందజేయాలని ఆదేశించారు.
చిత్తూరు జిల్లా రామకుప్పం, కాకినాడ జిల్లా తొండంగి, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజెర్ల మండలాలకి ఎంపీపీ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇచ్చారు. చిత్తూరు, బి.మఠం (కడప జిల్లా), రాజంపేట (అన్నమయ్య జిల్లా) స్థానాల్ల కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగనుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం, విజయాపురం.. నెల్లూరు జిల్లా రాపూరు, గాలివీడు (అన్నమయ్య), పార్వతీపురం (మన్యం), పెదకడబూరు (కర్నూలు), రాయదుర్గం (అనంతపురం)లో ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరుగుతాయి. 12 గ్రామ పంచాయతీలకి ఉప సర్పంచ్ ఎన్నికలకి కూడా నోటిఫికేషన్ జారీ చేశారు.